హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలొ రోజూ పెరుగుతున్న ఇంటర్నెట్ ఆధారిత నేరాలు అరికట్టేందుకు ఇకపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను పోలీస్ శాఖ నూతనంగా నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, సెమి అర్బన్ పోలీస్ స్టేషన్లలో ముగ్గురు మరియు మిగతా కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో అయిదుగురు చొప్పున పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ కూడా ఇచ్చారు.
రాష్ట్రం మొత్తం సుమారు 1988 పోలీసు అధికారులను ఎంపిక చేసారని నేటి నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణాకార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలిస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను నియమించడం దేశంలోనే పోలీసు రంగంలో ఇదే మొదటిసారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం దేశంలో మారుమూల గ్రామాలకు కూడా 4జీ మొబైల్ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా రిమోట్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రోజూ పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడం, సైబర్ నేరాలను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ సైబర్ వారియర్లు కీలకపాత్ర వహిస్తారని అన్నారు.