ఆంధ్రప్రదేశ్: గోరంట్ల మాధవ్‌కు సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, నవంబర్ 2, 2024న మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ కేసులో, సెక్షన్ 35(3) కింద, మార్చి 5న విచారణకు హాజరుకావాలని గోరంట్ల మాధవ్‌కు నోటీసులు అందజేశారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
గోరంట్ల మాధవ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని వాసిరెడ్డి పద్మ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా వెల్లడించడం చట్టవిరుద్ధమని, ఇది అమానవీయమని ఆమె ఆరోపించారు.
నోటీసులపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని విమర్శించారు. న్యాయ నిపుణులను సంప్రదించి, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. అయితే, విచారణ తేదీని మార్చాలని కోరుతున్నానని పేర్కొన్నారు.