టాలీవుడ్: దగ్గుబాటి కుటుంబం నుండి వచ్చి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. రానా నటించిన అరణ్య సినిమా ఈ నెలలో విడుదల అవనుంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు టీజర్స్ ఆకట్టుకున్నాయి. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యి ఎట్టకేలకు ఈ నెలలో విడుదల అవుతుంది.
‘ఏనుగులు మన కన్నా చాలా తెలివైనవి.. చాలా ఎమోషనల్ ఉంటాయి’ అనే డైలాగ్స్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అయింది. ప్రకృతి మరియు అడవుల సంరక్షణ కోసం అడవిలో నివసించే బల్దేవ్ పాత్రలో రానా నటిస్తున్నాడు. తమ స్వప్రయోజనాల కోసం అడవిలో కట్టడాలు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చి అడవిలో సంచరించే జంతువులు రాకుండా 60 కిలోమీటర్ల మేర ఎతైన గోడలు కట్టి అడవిని నాశనం చేసే రాజకీయవేత్తలపై పోరాటం సాగించే పాత్రలో రానా మెప్పించబోతున్నాడు. తమిళ నటుడు విష్ణు విశాల్ మరో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ప్రభుత్వం పై పోరాడే నక్సలైట్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
ట్రైలర్ ఆద్యంతం రానా తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. అడవిలో ఉండే మనిషి అవసరానికి తగ్గట్టు జర్నలిస్ట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. తమిళ్ లో కుంకీ (తెలుగులో గజరాజు) లాంటి సినిమాని రూపొందించిన ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల అవనుంది. మార్చ్ 26 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.