న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ప్రపంచ క్రికెట్ లో మేటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అయిన డేల్ స్టెయిన్ ఇవాళ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపాడు.
క్రికెట్ లో తన ప్రయాణం 20 ఏళ్లుగా అద్భుతంగా కొనసాగిందని, ఈ సమయంలో తనకు పూర్తిగా సహకరించి తోడుగా నిలిచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ మంగళవారం తన ట్వీట్ లో రాశాడు. 38 ఏళ్ల డేల్ స్టెయిన్ తన కెరీర్లో 93 టెస్ట్ మ్యాచ్ లు, 125 వన్డేలు, మరియు 47 టీ20లు ఆడి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 699 వికెట్లు తన ఖాతాలో వేశుకున్నాడు.
ఈ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్, బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున 95 మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లను పడగొట్టాడు. అయితే, స్టెయిన్ ఈ ఏడాది జనవరిలో ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కానీ, విదేశీ లీగ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.