ముంబై: డీమార్ట్ సంస్థ యజమాని, వ్యాపారవేత్త, బిలియనీర్ అయిన రాధాకిషన్ దమాని దాదాపు 1,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఒక ఇంటిని కొన్నారు. ముంబైలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన దక్షిణ మలబార్ హిల్‌లో ఈ ఖరీదైన ఇంటిని తన సోదరుడు గోపీకిషన్ దమానితో కలిసి ఆయన కొనుగోలు చేశారు.
ఆ ఇంటి కొలతలు 5,752.22 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి ఖరీదు అక్షరాలా 1,001 కోట్ల రూపాయలు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కోసం దమాని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు ఇప్పటికే ఏకంగా రూ.30 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కాగా దీని ప్రస్తుత మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచాన వేస్తున్నారు.
ఈ ఇంటిని రాధాకిషన్ సౌరభ్ మెహతా, వర్షా మెహతా, జయేశ షా నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దమాని ముంబైలోని ఆల్టమౌంట్ రోడ్‌లోని పృథ్వి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిని దమాని పురచంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్‌ఎల్‌పీ, పరేష్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్‌ఎల్‌పీ, ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్‌ఎల్‌పీ భాగస్వాముల నుంచి కొనుగోలు చేశారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, రాధాకిషన్ దమాని 14.5 బిలియన్ డాలర్ల ఆస్తితో భారతీయ సంపన్నుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. భారతదేశంలో 209 మంది బిలియనీర్లు ఉండగా, వారిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముకేష్ అంబానీ 85 బిలియన్ డాలర్ల ఆస్తులతో భారతీయ సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నారు.