అబుదాబి: ఐపీఎల్ చరిత్రలో టైటిల్ పోరుకు తిరిగి టాప్-2 లో ఉన్న జట్లే అర్హత పొందడం ఇది ఎనిమిదోసారి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్ బరిలో నిలిచింది. ఆదివారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది.
ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్), హెట్‌మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు.
లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. స్టొయినిస్ (3/26), రబడ (4/29) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు.
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు అనుభవజ్ఞుడైన అశ్విన్ తొలి ఓవర్లోనే 12 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ జోరు ఇక షురూ అనుకుంటున్న తరుణంలోనే రబడ రెండో ఓవర్ తొలి బంతికే వార్నర్ (2)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఐదో ఓవర్ వేసిన స్టొయినిస్, ప్రియమ్ గార్గ్ (17; 2 సిక్స్‌లు)ను బౌల్డ్ చేశాడు. రెండు బంతుల వ్యవధిలో మనీశ్ పాండే (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను ఔట్ చేశాడు.
కేన్ విలియమ్సన్, హోల్డర్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. క్రీజులో కుదురుకున్నాక విలియమ్సన్ చెలరేగాడు. హోల్డర్ (11) ఔటయ్యాక, అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు.
19 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన తరుణంలో విలియమ్సన్‌ను స్టొయినిస్ ఔట్ చేశాడు. రబడ ఒకే ఓవర్లో సమద్, రషీద్ ఖాన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఐదో బంతికి శ్రీవత్స్ గోస్వామి (0) కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు ఫైనల్ చేరడం ఇదే ప్రథమం.