DC vs LSG: అషుతోష్ మాయ.. పంత్ మిస్ చేసిన స్టంప్‌తో లక్నో ఓటమి!
వైజాగ్ వేదికగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 1 వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను (LSG) ఓడించి ఐపీఎల్ 2025 సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. చివరి ఓవర్ వరకూ మ్యాచ్ హడావుడిగా సాగగా, అషుతోష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో ఢిల్లీని గెలిపించాడు. మరోవైపు, కీలక సమయంలో కెప్టెన్ రిషభ్ పంత్ ఒక స్టంపింగ్ మిస్ చేయడంతో లక్నో చేతులారా గెలుపు చేజార్చుకున్నట్లైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 (6 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 (6 ఫోర్లు, 7 సిక్స్‌లు)తో మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 ఓవర్లలో 42 పరుగులకు 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2/20తో రాణించారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి విజయం సాధించింది. అషుతోష్ శర్మ 31 బంతుల్లో 66 నాటౌట్ (5 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 39 (5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ 34 పరుగులతో సహకరించారు.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2/19, మనిమరణ్ సిద్దార్థ్ 2/39, దిగ్వేష్ రతి 2/31, రవి బిష్ణోయ్ 2/53 తీసినా గెలుపు మాత్రం దూరమైంది. చివరి ఓవర్‌లో మోహిత్ శర్మను స్టంప్ చేసే అవకాశాన్ని పంత్ వదిలేసి మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అశ్చర్యకరమైన విజయం అందుకోగా, లక్నో చేజారిన అవకాశాన్ని చూసి షాక్ అయ్యింది.