లండన్: భారత కెప్టెన్ విరాట్ విస్డెన్ అత్యుత్తమ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్(2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సంవత్సర ప్రారంభంలో ఐసీసీ ప్రకటించిన మేల్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా ఎంపికైన కోహ్లికి మరొక అత్యుత్తమ గౌరవం దక్కింది.
2011 సంవత్సరంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌తో ఈ దశాబ్దాన్ని ఆరంభించిన కోహ్లి, ఒక దశాబ్ద కాల వ్యవధిలో వండే క్రికెట్ లో 60కి పైగా సగటుతో 11000 కు పైగా పరుగులు చేశాడు. వీటిలో 42 శతకాలు కూడా ఉన్నాయి. 2011 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో ఓ శతకం మరో అర్ధశతకం సాయంతో 282 పరుగులు సాధించిన కోహ్లి, భారత్‌ను రెండోసారి జగజ్జేతగా నిలపడంలో తనవంతు పాత్రను పోషించాడు.
రెండు సంవత్సరాల తరువాత 2013వ సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీ ఫైనల్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి, భారత కీర్తిపతాకను మరోసారి రెపరెపలాడించాడు. కాగా 2010 దశాబ్దంలో జరిగిన 5 ఐసీసీ టోర్నీల్లో కోహ్లి అద్భుతంగా రాణించడంతో టీమిండియా ప్రతి టోర్నీలో కనీసం సెమీస్ లో స్థానానికి చేరుకుంది.
కోహ్లి తన మొత్తం వన్డే కెరీర్‌లో ఆడిన 254 మ్యాచ్‌ల్లో దాదాపు 59.7 సగటుతో 12169 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలున్నాయి. ఇక మహిళల విభాగంలో ఆసీస్ క్రికెటర్ బెత్ మూనీ విస్డెన్ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకుంది. కాగా, విస్డెన్ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టును కూడా ప్రకటించింది. ఆ జట్టుకు కోహ్లినే నాయకుడిగా ఎంపిక చేసింది.