న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక తాలిబన్లకు భారత్ మధ్య సంబంధాల విషయంలో ఒక కీలక పరిణామం ఇవాళ చోటుచేసుకుంది. భారత రాయబారి దీపక్ మిట్టల్ తాజాగా ఖతార్‌లోని తాలిబన్ యొక్క అధికార ప్రతినిధి అయిన షేర్ మహ్మద్ అబ్బాస్ మధ్య చర్చలు విశేషంగా నిలిచాయి.
ఇవాళ దోహాలోని భారత్ యొక్క రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశం తాలిబన్ల అభ్యర్థన మేరకు జరిగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుపక్షాల మధ్య మొట్టమొదటి అధికారిక దౌత్య సంబంధాలపై జరిగిన ఈ మీట్‌లో భారత్ లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తాలిబన్ ప్రతినిధి హామీ ఇచ్చారని సమాచారం.
అఫ్గన్ దేశాన్ని భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలకు ఏమాత్రం ఉపయోగించరాదని మిట్టల్ తాలిబన్లను కోరారు. ఈ చర్చల్లో అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారత దేశీయుల భద్రత మరియు వారిని వేగంగా తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇంఖా అఫ్గాన్ జాతీయులు, ముఖ్యంగా మైనారిటీలు, భారతదేశాన్ని సందర్శించాలనుకునే వారి ప్రయాణ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చినట్టు తెలిపింది మంత్రిత్వ శాఖ. భారత్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తామని, తమ వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని కూడా ఇప్పటికే తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.