ముంబై: ఐపీఎల్ 2022లో జరిగిన రెండవ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైపై భోణీ చేసింది. ముంబై తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ సేన ముంబైపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 2021 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
ముంబై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒకానొక దశలో కేవలం 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితిలో ఢిల్లీ ఆల్‌రౌండర్లు లలిత్ యాదవ్( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు చేసి ఆఖర్లో మెరుపులు మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
కాగా ముంబై ఇండియన్స్ టీం ఐపీఎల్ 2012 సీజన్ నుండి తాము ఆడిన ప్రతి తొలి మ్యాచ్‌లో ఓడిపోతూ వస్తోంది. తాజాగా మరోసారి ఓటమిని మూటగట్టుకొని తమ చెత్త రికార్డును కొనసాగించింది.