ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో పరిమితమైంది. తాజా రాజకీయ పరిణామాల్లో ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీలో పలు పేర్లు చర్చకు వచ్చాయి.
నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు తమ సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా చర్చ జరగలేదని, నిర్ణయం త్వరలోనే పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందని చెప్పారు. అయితే, ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత బీజేపీ శాసనసభాపక్షం సమావేశం నిర్వహించి, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశముంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ పలు నేతలను పరిశీలిస్తోంది. అనుభవం, సామాజిక సమీకరణాలు ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఎప్పుడు జరుగుతుందో, చివరకు ఎవరు సీఎం అవుతారో వేచి చూడాలి.