న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. విడుదలైన ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో విజయాన్ని నమోదు చేసింది.
గత ఆదివారం జరిగిన ఐదు వార్డుల ఉప ఎన్నికల ఫలితాలు బుధవారం ప్రకటించబడ్డాయి. ఈ ఫలితాల్లో ఆప్ నాలుగు, కాంగ్రెస్ ఒకస్థానంలో విజయం సాధించింది. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఒక స్థానంలో గెలుపొంది కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోగా, బీజేపీకి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరం. తాజా ఫలితం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓట్ల లెక్కంపు మొదలైనప్పటి నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సునాయాసంగా విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. షాలీమార్ బాగ్ నార్త్, కల్యాణ్‌పురి, త్రిలోక్‌పురి, రోహిణి-సీ వార్డులలో గెలుపొందారు. దీంతో ఆప్ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. చౌహాన్ బాంగర్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది.
ఢిల్లీ ప్రజలు మరోసారి సుపరిపాలన కోసం ఓటు వేశారంటూ ట్వీట్ చేశారు. 15 ఏళ్ల నుంచి ఢిల్లీ కార్పొరేషన్‌లలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రజలు విసిగిపోయారని ఎంసిడిలలో ఆప్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారనివ్యాఖ్యానించారు. అభివృద్ధికి ఓటు వేసి గెలిపించిన ఢిల్లీ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.