ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. ఈ పోరులో పర్వేశ్ 3,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచారు.
కేవలం కేజ్రీవాల్ మాత్రమే కాకుండా, ఆప్ మరో కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు. జంగ్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో జైల్లో ఉన్న సమయంలో ఆయనకు లభించిన సానుభూతి కూడా ఓటర్లను ఆకర్షించలేకపోయింది.
ఇప్పటికీ ఆప్ ఖాతాలో మాత్రం కొన్ని విజయం నమోదయ్యాయి. కోండ్లి నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్ బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై 6,293 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇది ఈ ఎన్నికల్లో ఆప్‌కు వచ్చిన తొలి విజయం కావడం గమనార్హం.
ఇక బీజేపీ కూడా తమ ఖాతా తెరిచింది. లక్ష్మీనగర్ నియోజకవర్గంలో అభయ్ వర్మ ఘన విజయం సాధించారు. మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల ఫలితాలు ఢిల్లీలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేశాయని చెప్పొచ్చు.