ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం తన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను ఢిల్లీకి నేరుగా సరఫరా చేసేందుకు తయారీదారులు అంగీకరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కానీ ఎంత మోతాదులో రాష్ట్రానికి వ్యాక్సిన్ సరఫరా అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదని ఆయన తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే స్పుత్నిక్-వి తయారీదారులతో చర్చలు జరిపాము, వారు వ్యాక్సిన్ సరఫరా చేయడానికి అంగీకారం తెలిపారు. కాగా ఎంత మొత్తం వ్యాక్సిన్ ఇస్తారు అనే దానిపై పూర్తి స్పష్టత రాలేదు. మంగళవారం కూడా మరోసారి కంపెనీ తో మా అధికారులు చర్చలు జరిపారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చుసి తమ ప్రజలకు ఇవ్వచ్చు అని తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సరఫరాపై అనేక రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించినప్పటికీ ఈ ఒక్క తయారీ సంస్థ కూడా సరగరాకి సమ్మతించలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
ఒక్క రాష్ట్రానికి కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్ డోస్‌ను అందించలేక పోయింది. ప్రస్తుతం రాష్ట్రాల వ్యాక్సిన్ అవసరాన్ని కేంద్రం గుర్తించాల్సి ఉంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఇక లాక్‌డౌన్‌ను నిరవధికంగా కొనసాగించే ఆలోచన లేదు. అలా చేయడం వల్ల ఆర్ధిక, వ్యాపార కార్యకలపాలు దెబ్బతింటాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెలాఖరున లాక్‌డౌన్‌పై ఒక నిర్ణయం తీసుకుంటాం, అని తెలిపారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో రోజు రెండువేల కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1491 మంది కరోనా బారీన పడగా, 130 మంది కరోనాతో మృతి చెందారు.
అలాగే కరోనా పాజిటివిటీ రేటు కూడా రెండు నెలల కనిష్టానికి పడిపోయి 1.93 శాతానికి చేరింది. కానీ ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం పెరిగింది. మే 23న 200లకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25న 100 కంటే తక్కువ కేసులు నమోదవగా, ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారి సంఖ్య ఏకంగా 600కు చేరినట్లు సమాచారం.