అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్ అవసరమిన సమయంలో తమ వరుస ఓటములకు చెక్ పెట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో (ఆర్‌సీబీ) కీలకమైన చివరి మ్యాచ్‌లో గెలిచి ముంబై తరువాత స్థానంలో నిలిచింది. దీంతో పాయింట్ల పట్టకిలో టాప్–2లో నిలిచిన ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్స్‌లో ఒక మ్యాచ్‌లో ఓడినా, ఫైనల్ చేరేందుకు రెండో దారి (క్వాలిఫయర్–2) ఉంటుంది.
నవంబర్ 5న జరిగే తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. 6వ తేదీన జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడే ప్రత్యర్థి కోల్‌కతానా, హైదరాబాదా నేడు తేలుతుంది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. నోర్జే 3 వికెట్లు తీయగా, రబడ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఒకవేళ ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోపే ఛేదించి ఉంటే కోల్‌కతా నైట్‌రైడర్స్ రన్‌రేట్ కంటే బెంగళూరు జట్టుది తక్కువ అయ్యేది.
ఢిల్లీ పరుగుల వేట ధాటిగా మొదలైంది. మోరిస్ తొలి ఓవర్లో ధావన్ 2 బౌండరీలు కొట్టాడు. తర్వాత సిరాజ్ ఓవర్లో పృథ్వీ షా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ సిరాజ్ అద్భుతమైన డెలివరీతో పృథ్వీ షాను బౌల్డ్ చేశాడు. బెంగళూరు శిబిరం ఆనందతాండవం చేసింది. కానీ అనుభవజ్ఞుడైన రహానే, సీనియర్ ఓపెనర్ ధావన్ నింపాదిగా ఆడటంతో బెంగళూరుకు కష్టాలు తప్పలేదు. ఇద్దరు అనవసర షాట్లకు వెళ్లకుండా ఒకట్రెండు పరుగులు తీస్తూనే అడపాదడపా బౌండరీలు కూడా బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది.