దుబాయ్: ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ లో అధ్బుత ప్రదర్శనతో మరో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకిది ఆరో విజయం కాగా, రాయల్స్ కు ఐదో ఓటమి. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ధావన్ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాణించారు. అర్చర్ 3 వికెట్లు తీశాడు.
చేధనలో రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేసి ఓడింది. స్టోక్స్ (35 బంతుల్లో 41; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. నోర్జే, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీశారు. నోర్జేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రాజస్తాన్ లక్ష్యఛేదన బౌండరీతో మొదలైంది. బట్లర్‌తో ఓపెనింగ్ చేసిన స్టోక్స్ ఫోర్ బాదాడు. బట్లర్ కూడా బౌండరీ కొట్టడంతో రబడ తొలి ఓవర్లోనే 10 పరుగులు ఇచ్చుకున్నాడు. తర్వాత తుషార్ ఓవర్లో స్టోక్స్ 2 ఫోర్లు కొట్టాడు. ఇక మూడో ఓవర్లో అయితే బట్లర్ చెలరేగాడు. నోర్జే బౌలింగ్‌లో ఓ సిక్స్, వరుస రెండు ఫోర్లు కొట్టాడు.
15 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ స్కోరు 5 వికెట్లకు 123 పరుగులుగా ఉంది. ఆఖరి 5 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన సమీకరణం ఏమంత క్లిష్టమైంది కాదు. పైగా హిట్టర్లు తేవటియా, రాబిన్ ఉతప్ప క్రీజులో ఉన్నారు. కానీ స్పిన్నర్ అశ్విన్ పొదుపైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. తర్వాత పేసర్లు నోర్జే, రబడ పట్టుబిగించేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఇక విజయం ఢిల్లీ వైపే నిలిచింది.