చెన్నై: సన్‌రైజర్స్ తో ఆదివారం తాము ఆడిన మ్యాచ్ ఒక పెద్ద థ్రిల్లింగ్‌గా అనిపించిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ తెలిపాడు. ఈ మ్యాచ్ అసలు సూపర్ ఓవర్ కు వెళ్లే మ్యాచ్ ఏ మాత్రం కాదని, అయితే అంత వరకూ వెళ్లడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అయిన కేన్ విలియమ్సన్ ప్రధాన కారణమని అన్నాడు.
కాగా అతనొక చాంపియన్ ప్లేయర్ అని మరొకసారి నిరూపించుకున్నాడని ధవన్ అన్నాడు. మ్యాచ్ తర్వాత యాక్టింగ్ కెప్టెన్ హోదాలో మాట్లాడిన ధవన్, తాము ఇది ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అని అన్నాడు. తమ వైపు కొన్ని తప్పిదాలు జరిగాయని, అవి గేమ్‌లో భాగమేనన్నాడు.
గేమ్ మొత్తంలో తమదే పైచేయి అని, చివరకు సూపర్ ఓవర్ వరకూ వెళ్లాల్సింది కాదన్నాడు. విలియమ్ససన్ కడవరకూ ఉండటంతోనే మ్యాచ్ అంతవరూ వెళ్లిందన్నాడు. ఏది ఏమైనా చివరకు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నాడు.
ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లడం, అయితే ఢిల్లీ ఛేజ్ చేయడం మరింత ఆసక్తికరంగా అనిపించిందని అన్నాడు ధవన్. చిన్న చిన్న తప్పిదాలే ఈ మ్యాచ్‌లో ఫలితంపై ప్రభావం చూపాయన్నాడు. సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ రాణించకపోవడంతో తమకు ఎడ్జ్ దొరికిందని, అక్కడే తమ విజయానికి బాటలు పడిందని అన్నారు.
అయితే తమకు ఈ పిచ్‌పై ఆడటం అంత ఈజీగా లేదని అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లేలో ఆడటం ఇంకా కష్టంగా ఉంటుందన్నాడు. ఇక్కడ పిచ్ కంటే అహ్మదాబాద్ పిచ్ ఎంతో కొంత నయం అనిపించిందని ధవన్ తేల్చి చెప్పాడు.