జాతీయం: దిల్లీ కొత్త కేబినెట్: కోటీశ్వరులే మంత్రులు!
దిల్లీలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలోని అన్ని మంత్రులు కోటీశ్వరులేనని ఎన్నికల అఫిడవిట్లు వెల్లడించాయి. ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా మంత్రుల ఆస్తుల మొత్తం సగటు విలువ రూ.56 కోట్లుగా నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ADR) తన తాజా నివేదికలో వెల్లడించింది.
మంత్రివర్గంలో అత్యధిక ఆస్తిపరుడిగా మంత్రి మంజిందర్‌సింగ్ సిర్సా నిలిచారు. ఆయన వద్ద రూ.248 కోట్ల ఆస్తులు ఉండగా, రూ.1 కోట్ల ఆస్తులతో కపిల్ మిశ్రా చివరి స్థానంలో ఉన్నారు. మంజిందర్‌సింగ్ విద్యార్హత 12వ తరగతి మాత్రమే కాగా, మిగిలిన మంత్రులంతా డిగ్రీ, పీజీ విద్యార్థులే.
నేర అభియోగాలున్న మంత్రులు
ఏడుగురు మంత్రుల్లో రేఖా గుప్తా సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లు పేర్కొన్నాయి. మంత్రుల్లో అశీశ్ సూద్ అత్యంత తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు.
అసెంబ్లీ నుంచి బహిష్కరణ పొందిన స్పీకర్
భాజపా అసెంబ్లీ స్పీకర్‌గా ఖరారు చేసిన విజేందర్ గుప్తా గతంలో అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 2015లో, ఆప్ ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కారణంగా ఆయనను స్పీకర్ సభ నుంచి బహిష్కరించారు. మార్షల్స్ భుజాలపై ఎత్తుకుని సభ బయటకు తీసుకెళ్లిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
భాజపా ప్రభుత్వానికి ఎదురైన సవాళ్లు
రేఖా గుప్తా ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాత ప్రభుత్వ పథకాలను కొనసాగించడంతోపాటు కీలక ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రభుత్వం ముందు నిలిచిన ప్రధాన పరీక్షగా మారింది.
దిల్లీలో కాలుష్య నియంత్రణ, మౌలిక వసతుల అభివృద్ధి, యమునా నది ప్రక్షాళన వంటి కీలక సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మురుగునీటి పారుదల, రహదారుల నిర్వహణ దారుణంగా ఉందని భాజపా నేతలు ఆప్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పుడు అవన్నీ రేఖా గుప్తా సర్కార్ భాధ్యతగా మారాయి.
మంత్రులకు శాఖల కేటాయింపు
ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆర్థిక, మహిళా, శిశు సంక్షేమం, విజిలెన్స్, రెవెన్యూ శాఖలను స్వయంగా చూసుకోనున్నారు. పర్వేశ్ వర్మకు ప్రజాపనులు, తాగునీరు, నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలను అప్పగించారు. అశీశ్ సూద్‌కు హోం, విద్యుత్, విద్య, పట్టణాభివృద్ధి శాఖలు, కపిల్ మిశ్రాకు న్యాయ, కార్మిక, ఉపాధి, పర్యాటకం శాఖలు, మంజిందర్ సింగ్‌కు పరిశ్రమలు, అటవీ-పర్యావరణం, ఆహారం-సరఫరా శాఖలు, పంకజ్ సింగ్‌కు ఆరోగ్యం, రవాణా, ఐటీ శాఖలు, రవీందర్ ఇంద్రజ్‌కు సాంఘిక సంక్షేమం, ఎస్సీ/ఎస్టీ సంక్షేమం, సహకార శాఖలు కేటాయించారు.
సీఎం స్వగ్రామంలో సంబరాలు
రేఖా గుప్తా దిల్లీ ముఖ్యమంత్రి కావడం పట్ల ఆమె స్వగ్రామమైన హరియాణా నందగడ్ వాసులు ఉత్సాహంతో ఉన్నారు. స్థానికంగా ప్రవీణ్ అనే యువకుడు 22 రోజులుగా దీక్ష కొనసాగిస్తూ, ఆమె సీఎం కావాలని ప్రార్థిస్తున్నాడు. గ్రామంలో మరో 19 రోజుల పాటు జాతర జరగనుందని, దీక్ష కొనసాగిస్తానని అతడు వెల్లడించాడు.