అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు, విద్యాభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గడంతోపాటు కొత్త విద్యార్థుల చేరికలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం, పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివేలా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి విద్యారంగం పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సర్కారీ స్కూళ్ల వైపు విద్యార్థులు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం. 2019–20 విద్యా సంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ రెండు నెలల వ్యవధిలోనే మరో 70,000 మందికిపైగా విద్యార్థులు సర్కారీ స్కూళ్లలో ప్రవేశాలు పొందినట్లు సమాచారం.
ఇంకా అడ్మిషన్లు కొనసాగుతున్నందున ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను వీడి ప్రైవేట్ స్కూళ్లలో చేరిన వారి సంఖ్య దాదాపు 519 మాత్రమే ఉండటం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతూ 1–10 వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ల వైపు బారులు తీరుతున్నారు.
ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తూ చేపట్టిన ‘అమ్మ ఒడి’, జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఆసక్తి పెరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా రూ.650 కోట్లకు పైగా ఖర్చు చేసి 3 జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూలు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వడం ప్రభుత్వ స్కూళ్లకు ఆదరణ పెంచుతోంది.
నాడు–నేడు కింద దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో రూ.12 వేల కోట్లతో మరమ్మతులు చేపట్టడంతోపాటు మంచి నీటి సదుపాయం, రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, ప్రహరీల నిర్మాణం, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కంప్యూటర్, లైబ్రరీ బుక్స్, డిజిటల్ తరగతులు తదితర సదుపాయాలతో కార్పొరేట్ విద్యా సంస్థల తలదన్నేలా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు.