వాషింగ్టన్: కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ విమర్శించారు. ప్రాణాంతక వైరస్ కారణంగా లక్షా డెబ్బై వేల మంది అమెరికా పౌరులు మరణించారని, ఆర్థిక సంక్షోభం తలెత్తి వ్యాపారులు రోడ్డున పడ్డారన్నారు.
నిరుద్యోగ రేటు చాలా పెరిగిందని, లక్షలాది మంది యువత ఉపాధి లేక అల్లాడుతున్నారని ట్రంప్ సర్కారుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి విపత్కర సమయంలో కమాండ్ సెంటర్‌గా ఉండాల్సిన శ్వేతసౌధం, అధ్యక్షుడి అనుచిత సలహాలతో తుపాను కేంద్రంగా మారిందంటూ విమర్శలు గుప్పించారు.
మరో నాలుగేళ్లు ఆయనకు అధికారం అప్పగిస్తే ఎదుటి వారిపై నిందలు వేయడానికి, ఇతరులపై నోరు పారేసుకోవడానికే సమయం సరిపోదని, అలాంటి వ్యక్తి మెరుగైన పాలన ఎలా అందిస్తారంటూ విరుచుకుపడ్డారు.
ఎన్నికలు అంటే ట్రంప్‌కు టీవీ చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపడం వంటి విషయమని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా లేని వ్యక్తిని మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు.
కాగా అగ్రరాజ్యంలో నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్‌ను నామినేట్ చేస్తూ డెమొక్రటిక్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా బిడెన్ రన్నింగ్‌మేట్‌గా కమలా హారిస్ పేరును ప్రకటించారు.
ఈ సందర్భంగా బిల్ క్లింటన్ మాట్లాడుతూ, అమెరికాకు పూర్వవైభవం రావాలంటే బిడెన్‌కు ఓటు వేయాలని కోరారు. ప్రతీ విషయంలోనూ బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ, దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్లగల సత్తా ఆయనకు ఉందని పేర్కొన్నారు.