జాతీయం: అయోధ్యలో భక్తుల తాకిడి : 96 గంటల్లో 65 లక్షల మంది దర్శనం
మౌని అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ ఊహించని స్థాయికి చేరుకుంది. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు పోటెత్తిన కోటికి పైగా భక్తులు, పుణ్యస్నాన అనంతరం అయోధ్యకు బారులు తీరారు.
ఇలా 96 గంటల వ్యవధిలోనే 65 లక్షల మంది భక్తులు అయోధ్య చేరుకున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రికి రాత్రే అయోధ్య వీధులు భక్తులతో నిండిపోయాయి. ఈ పెరిగిన రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రభుత్వం కేంద్ర బలగాలను మోహరించింది.
అధికారిక లెక్కల ప్రకారం, మౌని అమావాస్య రోజునే 8-10 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. పుణ్యస్నానం పూర్తయిన వెంటనే, వారి ప్రయాణ గమ్యం అయోధ్య అయింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు భక్తులతో కిక్కిరిశాయి.
రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. గోండా, అంబేద్కర్ నగర్, సుల్తాన్‌పుర్, లఖ్‌నవూ రహదారుల వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
భక్తులు దేశం నలుమూలల నుంచి అయోధ్యకు తరలివస్తున్నారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ వెల్లడించారు.
రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో, వారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజువారీ దర్శనాల సంఖ్య దాదాపు 3 లక్షల వరకు పెరిగిందని, ఈ క్రమంలో ఆలయం దర్శన సమయాన్ని 18 గంటల పాటు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
భక్తుల కోసం అన్ని రకాల వసతులు మెరుగుపరచే చర్యలు చేపట్టారు. ట్రాన్స్‌పోర్ట్, భద్రత, క్యూ లైన్ నిర్వహణ వంటి అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
ఆదివారం, సోమవారం రోజులలో అత్యధిక భక్తుల రద్దీ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా ఇంకా కొనసాగుతుండటంతో, రాబోయే రోజుల్లో అయోధ్యలో భక్తుల ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది.