హైదరాబాద్: వినాయక చవితి అనగానే తెలుగు రాష్ట్రాలలో గుర్తు వచ్చేది ఖైరతాబాద్ లో కొలువయ్యే అత్యంత పెద్ద వినాయకుడు. ఎన్నో సంవత్సరాలుగా తన ఎత్తు పెంచుకుంటూ భక్తులని అలరించే ఆ స్వామి ఈ సారి కళ తప్పిన చందాన 9 అడుగుల అతి తక్కువ ఎత్తు లో వెలిశాడు. తెలుగు వారికి ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే అయినా కరోన మహమ్మారి నేపథ్యంలో తప్పని పరిస్థితి.
ఈ సారి ధన్వంతరీ నారాయణ గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు ప్రతి సంవత్సరం లాగానే ప్రత్యేకంగా తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రసాదం ఖైరతాబాద్ గణపతి చేతిలో నిలిచింది.
స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని తొలి పూజ నిర్వహించారు. పది కిలోల వెండిని గణపతికి సమర్పించారు. గతంలో కంటే విభిన్నంగా తొమ్మిది అడుగుల మట్టితో గణపతిని ప్రతిష్టించారు. కరోనా కారణంగా వేడుకలను నిరాడంబరంగా జరుపుతున్నారు.
కోవిడ్ నిబంధనల నేపథ్యంలో వేలాదిగా తరలివచ్చే భక్తులను కట్టడిచేసేందుకు కేవలం ఆన్‌లైన్లో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే భక్తులకు దర్శనం కు అనుమతి ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం వేళల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఈ సారి ప్రత్యక్ష దర్శన భాగ్యం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.