స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో CSK చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సీజన్ నుంచి తప్పుకోగా, జట్టు పగ్గాలు మళ్లీ ఎంఎస్ ధోని భుజాలపై వేశారు. జోఫ్రా ఆర్చర్ వేసిన బాల్ వల్ల గైక్వాడ్ ఎల్బోలో హెయిర్‌లైన్ ఫ్రాక్చర్‌కు గురి కావడంతో తప్పుకోవాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వెంటనే నిర్ణయం తీసుకుని ఐదు ట్రోఫీల కెప్టెన్ మహీకి మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. శుక్రవారం జరిగే కోల్‌కతా మ్యాచ్ నుంచి ధోని కెప్టెన్‌గా మళ్లీ మైదానంలో అడుగుపెడతారు. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటములతో తొమ్మిదో స్థానంలో ఉన్న సీఎస్‌కేకు ఇది కీలక మలుపు.
ధోని ఇప్పటికే పంజాబ్ మ్యాచ్‌లో 12 బంతుల్లో 27 పరుగులతో తన ఫామ్‌ను చూపించారు. కానీ ఇప్పుడు తనకు ముందు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలని మాజీ ఆటగాళ్లు సలహా ఇస్తున్నారు. నాలుగో లేక ఐదో స్థానంలో ధోని వస్తే, జట్టు విజయం సాధించే అవకాశం ఎక్కువని అంచనా.
ఫ్యాన్స్‌కి మాత్రం ఇది ఉత్సాహంగా మారింది. మరలా కెప్టెన్‌గా ధోని మైదానంలో కనిపించబోతున్న సందర్భం వారికెంత స్పెషల్‌గా ఉందో చెప్పాల్సిన పనిలేదు. మిస్టర్ కూల్ లీడర్షిప్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకుంటుందా? వేచి చూడాల్సిందే.