చెన్నై: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అయిన మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో కొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్‌గా మిస్టర్ మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని, 2020 వరకు ఆడిన లీగ్ ద్వారా రూ.137 కోట్ల ఆదాయం ఆర్జించాడు.
ఐపీఎల్ 2021 సీజన్‌కు కూడా మళ్ళీ చెన్నై ఫ్రాంచైజీ ధోనీని కొనసాగిస్తూ ఈ సారీ రూ.15 కోట్లు చెల్లించనుంది. దీంతో మహీ సంపాదన రూ.152 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కలతో రూ.150 కోట్ల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా ధోని ఈ అరుదైన ఘనత సాధించాడు. ధోని తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రూ.146.6 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తరువాత రూ.143 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.
2008 లో మొదలైన ఐపీఎల్ నుండి ఇప్పటి వరకు ధోనీ మొత్తం 13 సీజన్‌లు ఆడాడు. 2008లో రూ.6 కోట్లకు ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. మూడేళ్లు అదే ధరకి కొనసాగాడు. 2011లో బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్ ప్లేయర్ ధరని రూ.8 కోట్లకి పెంచింది. దాంతో 2011 నుంచి 13 వరకు రూ.8.25 కోట్లు ఆర్జించాడు. 2014లో మెగా వేలానికి ముందు బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్ ప్లేయర్ ధరని రూ.12 కోట్లకి పెంచగా, 2014, 2015 సీజన్లలో ధోనీకి రూ.12.5 కోట్లు చెన్నై చెల్లించింది.
ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం పడటంతో.. ఆ రెండేళ్లు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ఎంఎస్ ధోనీ ఆడాడు. అప్పుడు కూడా ఒక్కో ఏడాది రూ.12.5 కోట్లు ఆర్జించాడు. ఇక గత మూడేళ్ల నుంచి(2018,19,20) ధోనికి రూ. 15 కోట్లు చెల్లిస్తూ వస్తోంది.