న్యూఢిల్లీ: కరోనా ప్రభావం వల్ల దాదాపు ఐదు నెలల అనంతరం భారత క్రికెటర్లు మళ్ళీ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ ఇళ్లకే పరిమితమైన టీమిండియా క్రికెటర్లు, వచ్చే నెలలో దుబాయి వేదికగా జరుగనున్న ఐపీఎల్‌లో ఆడటానికి సన్నద్ధమయ్యారు. కాంపిటీటివ్ క్రికెట్‌లో తమను తాము నిరూపించుకోవడానికి ఇదే సమయం అని భావిస్తున్న వెటరన్ క్రికెటర్ల లిస్ట్‌లో ఎంఎస్ ధోనితో పాటు సురేశ్ రైనా కూడా ఉన్నాడు.
గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని, ఇప్పుడూ ఐపీఎల్‌లో తన సత్తాచాటాలని భావిస్తున్నాడు. మళ్లీ భారత్ జట్టులోకి ధోని రీఎంట్రీ ఉంటుందా, లేదా అనేది ఐపీఎల్‌తో డిసైడ్ అయిపోతుంది. ఆ బాటలోనే రైనా కూడా ఉన్నాడు. ఎప్పుడో భారత క్రికెట్‌కు దూరమైన రైనా మాత్రం తన పునరాగమనం పై ఆశగా ఉన్నాడు.
కచ్చితంగా ఐపీఎల్‌లో నిరూపించుకుని మళ్లీ భారత సెలక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నాడు రైనా. ఐపీఎల్‌లో సీఎస్‌కే ఆటగాడైన రైనా.. హిందూస్తాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా తనకెంతో ఇష్టమైన కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనిని పొగడ్తల్లో ముంచెత్తాడు.
యూఏఈలో ధోని ఏమిటో మళ్లీ చూస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తన మార్కు హెలికాప్టర్ షాట్లకు మరొకసారి సానబెట్టిన ధోని.. ఈ సీజన్ ఐపీఎల్‌లో వాటితో మనల్ని మైమరిపిస్తాడన్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌కు గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఒక శుభపరిణామనని, అందుకోసం తామంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నాడు.