అమరావతి: PSR ఆంజనేయులు అరెస్ట్‌పై ధూళిపాళ్ల స్పందన!
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఏమన్నారు?
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఎసీబీ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్టు వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే విషయం ఈ అరెస్ట్ ద్వారా మరోసారి నిరూపితమైందని అన్నారు.
అధికారాన్ని ‘వైసీపీ’ కోసమే దుర్వినియోగం చేసారని విమర్శ
గత ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు ప్రజాసేవకునిగా కాకుండా, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ధూళిపాళ్ల అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అమాయకులను, టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని, కక్ష తీర్చుకునే ధోరణితో వ్యవహరించారని విమర్శించారు.
మహిళలపై వేధింపులు, తప్పుడు కేసులు
పీఎస్ఆర్ ఆంజనేయులు బాధ్యతాయుత పదవులను దుర్వినియోగం చేసి, టీడీపీకి సానుభూతిపరులపై, ముఖ్యంగా మహిళలపై, తప్పుడు కేసులు బనాయించి వేధించారని ధూళిపాళ్ల మండిపడ్డారు. పలువురు మహిళల కన్నీటికి ఆయనే కారణమని ఆరోపించారు.
పేపర్ లీక్ స్కాంలో పాత్రపై ఘాటు వ్యాఖ్య
APPSC పేపర్ లీక్ స్కాం విషయాన్ని ప్రస్తావించిన ధూళిపాళ్ల, వేలాది మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేశారని అన్నారు. అవినీతికి పాల్పడిన వారికి రక్షణ కల్పించి, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేసారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నో తప్పుడు చర్యల ద్వారా అసాంఘిక శక్తులకు కొమ్ముకాస్తూ పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో అసహ్యం కలిగేలా ప్రవర్తించారని పేర్కొన్నారు.
చట్ట విరుద్ధ చర్యలకు శిక్ష తప్పదన్న హెచ్చరిక
పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ ద్వారా ఎంతటి అధికారి అయినా చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదన్న సందేశం సమాజానికి చేరిందని ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు. ఇకపై ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు సహించరని హెచ్చరించారు.