హెల్త్ డెస్క్: డయాలసిస్ రోగులు ఏ ఆహారం తీసుకుంటే మంచిది?
కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్‌పై ఆధారపడే రోగులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రత్యేక ఆహార నియమాలను పాటించడం చాలా అవసరం. కిడ్నీలు విఫలమైన పరిస్థితుల్లో శరీరంలో వ్యర్థాలు, ద్రవాలు నిలిచి ప్రాణాపాయకర పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ చేయించడం వలన మలినాలు తొలగించబడుతాయి. అయితే, డయాలసిస్ రోగులకు సరైన ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పాటించాల్సిన ఆహార నియమాలను తెలుసుకుందాం.
నీరు తక్కువగా తీసుకోవాలి:
ప్రముఖ పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం, డయాలసిస్ రోగులు ప్రతిరోజు తీసుకునే నీటిని లీటర్‌కి పరిమితం చేయాలి. దీనిలో కూరల్లో కలిపే నీటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లను, ముఖ్యంగా ద్రాక్షను, తీసుకోవద్దని వారు సూచించారు. యాపిల్, బొప్పాయి, జామ వంటి పీచు అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం ఆరోగ్యకరమని చెబుతున్నారు. అయితే, ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగకుండా, విరామం తీసుకుని త్రాగాలని సూచిస్తున్నారు.
ఆకు కూరలు మరియు ఇతర కూరగాయలు:
ఆకుకూరలు డయాలసిస్ రోగులకు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, బ్లడ్ తిన్నర్స్ తీసుకునే వారు వీటిని తగ్గించి తీసుకోవాలి. అదేవిధంగా, పొటాటో మరియు ఇతర దుంప కూరగాయలను తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. పాలకూర, టమాటా కలిపి తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కలగవచ్చని హెచ్చరిస్తున్నారు.
సంపూర్ణ పోషకాహారం:
డయాలసిస్ రోగులకు తక్కువ ఉప్పు, తక్కువ పొటాషియం, తక్కువ పాస్పరస్ ఉండే ఆహారాన్ని సూచిస్తున్నారు. కొంచెం మాంసకృత్తులు, పప్పు ధాన్యాలు, బ్రౌన్ రైస్ లాంటి పీచు అధికంగా ఉండే ఆహారం తినడం శ్రేయస్కరం. ఇందులో ప్రత్యేకించి పాల ఉత్పత్తులను మరియు ఉప్పును నియంత్రించుకోవాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.
షుగర్ మరియు ఇతర సూచనలు:
డయాలసిస్ రోగులకు షుగర్ నియంత్రణ కూడా అత్యవసరం. అధిక శర్కర స్థాయిలు కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి, డయాలసిస్ రోగులు శ్రేయస్సును కాపాడుకోవడానికి, అధిక ఉప్పు, అధిక షుగర్ ఉన్న ఆహార పదార్థాలను తగ్గించుకోవడం అవసరం.
గమనిక: ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారాన్ని శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు, మరియు వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా అందిస్తున్నాం. అయితే, ఈ సూచనలను అనుసరించేముందు మీ వ్యక్తిగత వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యము.