తెలంగాణ: ప్రజల స్వరాష్ట్ర సాధనలో 2009 నవంబర్ 29 ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. అదే రోజున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాదులను వేసిన ఘట్టంగా గుర్తుంచుకుంటారు. ఈ సందర్భంగా ఈ నెల 29న తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
తాను కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో పాల్గొంటానని తెలిపారు. దీక్షా దివస్ ప్రజలకు తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన న్యాయ పోరాటాలను గుర్తు చేస్తుందని అన్నారు.
2009లో కేసీఆర్ దీక్ష దేశవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థను కదిలించిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల దీక్ష, త్యాగాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసేందుకు బలవంతమైందన్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు చాటి చెప్పేలా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. దీక్షా దివస్‌లో ప్రతీ ఒక్కరు పాల్గొని ఉద్యమ త్యాగాలను గౌరవించాలని ప్రజలను కోరారు.