మహారాష్ట్ర: మహా సంగ్రామంలో గురుశిష్యులు
మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీయేకు చంద్రబాబు, ఎంవీఏకు రేవంత్.. ప్రచారంలో తెలుగు సీఎంల హోరాహోరి
మహారాష్ట్రలో ఈ నెల 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠ రేపుతోంది.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ స్థానిక నేతలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఎన్‌డీయే తరుపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంవీఏ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
ఎన్డీయే తరుపున చంద్రబాబు ప్రచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నుండి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొననున్నారు.
ఆయన ప్రధానంగా ముంబై సహా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీలతో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
ఎన్‌డీయే కూటమి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున, మహారాష్ట్రలో ఉన్న తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాల్లో ఆయనతో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు.
ఎంవీఏ తరుపున రేవంత్ రెడ్డి ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొంటారు.
ఎంవీఏ కూటమి తరపున ప్రచారం చేస్తున్న ఆయన, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నారు.
అలాగే, ఎంవీఏ గెలుపు అనివార్యమని చెప్పి, కార్నర్ మీటింగ్స్ లోనూ పాల్గొని ప్రజలను ప్రభావితం చేయనున్నారు.
ఎన్డీయే తరుపున చంద్రబాబు, ఎంవీఏ తరుపున రేవంత్ రెడ్డి ప్రచారంతో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు మహారాష్ట్రలో ప్రత్యర్థి కూటముల తరపున ప్రచారంలో ఉన్నారు.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 20న పోలింగ్ జరగనుండటంతో మరో మూడు రోజుల పాటు ప్రచార ఉధృతం కొనసాగనుంది.