అంతర్జాతీయం: కలవరపెడుతున్న ఇరాన్‌లోని మరణశిక్షలు – ఏడాదిలో 900 మందికి ఉరిశిక్ష
ఇరాన్‌లో 2024లో 901 మందికి మరణశిక్ష అమలు చేసినట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) వెల్లడించింది. గత డిసెంబర్‌లో ఒకే వారంలో 40 మందిని ఉరితీసినట్లు పేర్కొంది. మరణించిన వారిలో 31 మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపి, ఈ శిక్షల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది.
హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అత్యాచారం, లైంగిక దాడి వంటి నేరాలకు సంబంధించి ఇరాన్‌లో మరణదండన అమలు చేయడం సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ సంఖ్య ఏటా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనా తర్వాత ఇరాన్ మరణశిక్షలు ఎక్కువగా అమలు చేసే దేశంగా నిలిచింది.
మానవ హక్కుల సంస్థలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి గ్రూపులు ఈ శిక్షలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లో భయాన్ని నింపేందుకు ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను ఒక ఆయుధంగా వాడుతోందని హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. 2022లో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలతో సంబంధం ఉన్న వారిని కూడా ఉరితీసినట్లు ఐరాస పేర్కొంది.
ఇరాన్‌లో పెద్ద సంఖ్యలో మహిళలకు మరణశిక్ష విధిస్తారు. 2024లో ఇరాన్‌లో 31 మంది మహిళలకు మరణశిక్ష విధించినట్లు నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సోమవారం ఒక నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ ఇరాన్‌లో మరణశిక్ష కేసులను నిశితంగా పరిశీలిస్తుంది.
2022లో పోలీసులు హిజాబ్‌ను సరిగా ధరించలేదని మాసా అమిని అనే యువతిని కస్టడీలోకి తీసుకోవడం, అక్కడ ఆమె మృతి చెందడం తీవ్ర విమర్శలకూ, ఆందోళనలకూ దారితీసింది. ఈ నిరసనల నేపథ్యంలో మరణశిక్షలు మరింత ఎక్కువయ్యాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మరణశిక్షను వ్యతిరేకిస్తున్నామని వోల్కర్ టర్క్ అన్నారు. ఇది జీవించే ప్రాథమిక హక్కుకు విరుద్ధం. ఇది కాకుండా.. మరణశిక్ష అమాయకులను ఉరితీసే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఉరిశిక్షలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి ఇరాన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది.
మాదకద్రవ్యాల కేసుల్లో మరణదండన ఎక్కువగా అమలవుతున్నప్పటికీ, నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం అనేక ప్రశ్నలకు కారణమైంది. ఈ మరణశిక్షలను పూర్తిగా రద్దు చేయాలని ఐరాస సహా పలు హక్కుల సంఘాలు కోరుతున్నాయి.
ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షలను ప్రజలను భయపెట్టేందుకు, నిరసనలను అణచివేయడానికి ఉపయోగిస్తోందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. ఆందోళనకారుల హక్కులను కాపాడేందుకు, ఇలాంటి కఠిన చర్యలను ఆపేందుకు ప్రపంచ సమాజం చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.