హెల్త్ డెస్క్: గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ మందులు అందరికీ పని చేయట్లేదా?
ప్రస్తుత పరిస్థితుల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు ఉపయోగించే మందులు ప్రతిసారీ సరిగా పనిచేయడం లేదని జీనోమ్ ఫౌండేషన్ చేసిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గుండె సమస్యలు, స్ట్రోక్ వచ్చినవారు క్లోపిడొగ్రెల్, స్టాటిన్ వంటి మందులు వాడుతుండగా, వీటిలో కొన్ని 100% ప్రభావం చూపడం లేదని ఈ అధ్యయనంలో తేలింది.
గుండెపోటు మందులు పని చేయడంలో లోపం!
పరిశోధన ప్రకారం, ప్రతి నలుగురిలో ఒకరికి ఈ మందులు పని చేయడం లేదు అని వెల్లడయ్యింది. దీనివల్ల రోగులకు రెండోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐజీ ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ బి.సోమరాజు మాట్లాడుతూ, ఈ పరిణామాలను గుర్తించడం అత్యంత కీలకమని, రోగులు జన్యు పరీక్ష చేయించుకుని ప్రత్యామ్నాయ మందులు తీసుకోవాలని సూచిస్తున్నారు.
26% మందిలో మందులు పని చేయడంలేదు!
జీనోమ్ ఫౌండేషన్ చేసిన పరిశోధనలో 26% మందిలో ఈ మందులు పని చేయడం లేదని తేలింది. మరో 13% మందిలో మందులు ఎక్కువగా పని చేస్తున్నాయని గమనించబడింది. ఈ పరిస్థితులు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరణాలు తగ్గినా, మైనర్ హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి!
పది నుంచి పదిహేనేళ్ల క్రితం గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు వైద్య సాంకేతికత పెరగడంతో హార్ట్ ఎటాక్స్ మరణాలు తగ్గుతున్నాయని డాక్టర్ బి.సోమరాజు వివరించారు. అయితే, పెద్ద హార్ట్ అటాక్స్ తగ్గి, చిన్న అటాక్స్ ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.
జన్యు పరీక్షలు ద్వారా పరిష్కారం
ఈ సమస్యలను నివారించడానికి రోగులు తమ జన్యు పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు ప్రత్యామ్నాయ మందులు వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.