తెలంగాణ: తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయంలో హైకోర్టులో ప్రముఖ రాజకీయం నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తయింది. కేసు తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.
హైకోర్టు ఆదేశాలు
కేటీఆర్ పిటిషన్‌పై గతంలో విచారణ సందర్భంగా ఈనెల 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఏసీబీకి దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు వినిపించుకున్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
ఏజీ వాదనలు
ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఫార్ములా-ఈ రేసు ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా రూ.46 కోట్లు చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి సంబంధించిన నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించినట్లు వాదనలు వినిపించారు.
ప్రాధమిక దర్యాప్తు
దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, అన్ని ఆధారాలు సమర్పించేందుకు మరికొంత సమయం అవసరమని ఏజీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్ వాంగ్మూలం సేకరించారని కోర్టుకు తెలిపారు.
దానకిశోర్ తరఫు వాదనలు
దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే ఫార్ములా-ఈ రేసు చెల్లింపుల ఫైళ్లను ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని నిబంధనలను ఉల్లంఘించారని ఆయన కోర్టుకు వివరించారు.
మరోసారి విచారణ వాయిదా
విచారణ 27నుంచి 31కు వాయిదా పడగా, ఇరు పక్షాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పు ప్రకటించే వరకు మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.