ఏపీలో టోల్ ప్లాజాల ద్వారా ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చిందో తేలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే.
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల ద్వారా ఇప్పటివరకు భారీ మొత్తం వసూలైనట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో వెల్లడించారు. తెలంగాణకు చెందిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, గడ్కరీ ఈ లెక్కలు వెల్లడించారు.
ప్రస్తుతం ఏపీలో 67 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ ప్లాజాల ద్వారా అవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.22,377 కోట్లను వసూలు చేసినట్లు గడ్కరీ తెలిపారు. ఇందులో ప్రధానంగా జాతీయ రహదారి 16 (కోల్‌కతా-చెన్నై) పై వసూలైన మొత్తం రూ.14,550 కోట్లుగా ఉంది. ఈ ఒక్క రహదారిపైనే మొత్తం టోల్ వసూళ్లలో 65 శాతం వసూలైనట్లు గణాంకాలు చూపిస్తున్నాయి.
జాతీయ రహదారుల అభివృద్ధి పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో చేయడం వల్ల టోల్ ట్యాక్స్ వసూళ్ల ప్రస్తుత విధానం అమల్లోకి వచ్చింది. కాంట్రాక్టర్లు రోడ్ల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన మొత్తం వడ్డీతో సహా వసూలు చేసుకునేందుకు ఎంత కలం పడుతుందో లెక్కగట్టి.. ఆ కాలానికి అనుమతిస్తూ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో వాహనాల సంఖ్య ఆధారంగా టోల్ రేట్లు ప్రతి ఏడాది సమీక్షించి పెంచడం లేదా తగ్గించడం జరుగుతోంది.
ఇది ప్రయాణికులపై ఆర్థిక భారం పెంచడంతో, అవసరం ఉంటే తప్ప జాతీయ రహదారులను ఉపయోగించ లేని పరిస్థితి. ఇదే సమయంలో టోల్ రేట్లపై ప్రజల నుంచి అసంతృప్తి వెల్లువెత్తుతోంది.