హైదరాబాద్: చిలుకలగూడ రైల్వే డిస్పెన్సరీ వైద్యుడికి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న 14 రోజులకు కరోనా పాజిటివ్‌గా తేలడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు సదరు బాధితుడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే ఆ బాధితుడి శరీరంలో ఉన్నది యాక్టివ్ వైరస్సా లేక డెడ్లీ వైరస్సా అనే కోణంలో విశ్లేషణ చేస్తున్నారు శస్త్రవేత్తలు. కాగా వైరస్ నిర్ధారణ అయిన వైద్యుడితో సన్నిహితంగా ఉన్న తన కుటుంబీకులు, సహోద్యోగులకు పరీక్షలు నిర్వహించగా, వారి అందరికీ పరీక్షల్లో నెగెటివ్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆ వైద్యుడు జనవరి మూడో వారంలో తొలి విడత ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత 28 రోజులకు అదే కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను రెండో డోసు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో భాగంగా అతను ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఆయన ఇటీవల జలుబు, జ్వరంతో బాధ పడుతుండటంతో ఇటీవల పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది.
ఎవరైతే వ్యాక్సిన్ యొక్క రెండు డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాత వారికి పూర్తి స్థాయిలో యాంటీబాడీలు వృద్ధి కావాలి. కానీ ఆ వైద్యుడి విషయంలో ఆ నిర్దేశిత గడువు ముగిసినప్పటికీ కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీకా తీసుకున్న వారిలోనూ మళ్లీ వైరస్ నిర్ధారణ అవుతుండటం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.