తాడేపల్లి: యూకేలో కోవిడ్ కొత్త వేరియంట్ మరియు సెకండ్‌వేవ్ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ‘ఆస్పత్రుల్లో నాడు-నేడు’పై సీఎం సమీక్ష జరిపారు.
ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించారని, ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. సూపర్ స్పెషాల్టీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి ఇప్పుడున్న సదుపాయాలపై వివరాలు అందించారు. వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉన్నారని అధికారులు వెల్లడించారు.
మారుమూల గ్రామాల్లోకే స్వయంగా డాక్టర్లు వచ్చి వైద్యం చేసేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్‌సీలు ఉండేలా చూడాలి. అంచనాగా ప్రతి పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు చొప్పున నలుగురు డాక్టర్లు ఉన్నారనుకుంటే, ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలి. ప్రతి నెలకు రెండు సార్లు డాక్టర్ తనకు నిర్దేశించిన అదే గ్రామాలకు వెళ్లాలి. దీంతో గ్రామాల్లో ప్రజలకు, వారి ఆరోగ్య పరిస్థితుల మీద డాక్టర్‌కు అవగాహన ఏర్పడుతుంది.
డాక్టర్ సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ కూడా వేదికగా ఉంటుంది. కొంతకాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్‌కు పూర్తి అవగాహన ఏర్పడుతుంది.దీంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది. దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగానే ఉండాలి. దీనిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధంచేసుకోవాలి. ఈ వ్యవస్థను ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకు వస్తారన్న దానిపై తేదీని కూడా ఖరారు చేయాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.