fbpx
Friday, January 31, 2025
HomeAndhra Pradeshఅతివిశ్వాసం వద్దు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

అతివిశ్వాసం వద్దు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

DON’T-BE-OVERCONFIDENT–CHANDRABABU-MAKES-KEY-COMMENTS!

అమరావతి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే వ్యూహరచనలో భాగంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, సూచనలు చేసారు.

ఎన్డీయే నేతలకు సీఎం టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీయే కూటమి (NDA Alliance) ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, విజయానికి సరైన వ్యూహాన్ని అమలు చేయాలని, అతి విశ్వాసానికి పోవద్దని సూచించారు.

ఎన్డీయే అభ్యర్థుల ఎంపిక
ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల కానుండగా, ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ జరగనుంది. ఉభయ గోదావరి జిల్లాలు మరియు ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్డీయే అభ్యర్థులుగా ప్రకటించారు.

ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక
గ్రాడ్యుయేట్ ఓటర్లను సమర్ధవంతంగా ఆకట్టుకోవడం కోసం క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన (Janasena), బీజేపీ (BJP) కమిటీల నేతల సమన్వయంతో సమిష్టిగా పని చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సుస్థిర పాలనకు ప్రతి ఎన్నిక కీలకమని, ప్రతీ గ్యాడ్యుయేట్‌ను కలిసి భారీ మెజారిటీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు.

నాయకత్వ తీరు.. కొత్తవారికి స్పష్టమైన దిశానిర్దేశం
ఈ ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. గత ఏడాది ఏర్పాటైన కూటమి ప్రభుత్వం, గత 7 నెలల్లో అనేక ఇబ్బందులను అధిగమించి సుపరిపాలన వైపు పయనిస్తోందని పేర్కొన్నారు.

కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు
కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విశదీకరించాలన్న చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిర్ణయాలు, అమరావతి అభివృద్ధి నిధులు, పోలవరానికి ఆర్థిక సాయం, రైల్వే జోన్ వంటి అంశాలను ప్రజలలోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు.

పెట్టుబడులు, ఉద్యోగాలు.. అభివృద్ధి దిశలో ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 4,10,125 ఉద్యోగాలు సృష్టించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రకటించారు.

ఎన్నికల ముందస్తు వ్యూహం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి ప్రణాళిక రూపొందించుకోవాలని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేసినట్లుగానే ఈ ఎన్నికలలోనూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.

ఉపాధ్యాయ సంఘాల మద్దతు
ఎన్డీయే అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాల మద్దతును సీఎం చంద్రబాబుకు వివరించారు. యూటీఎఫ్ మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు తమకు మద్దతుగా ఉన్నాయని వారు వెల్లడించారు.

ఎన్నికలపై చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం
“ఎవ్వరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దు” అని చంద్రబాబు నేతలను హెచ్చరించారు. ప్రతి ఎన్నికలో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular