అంతర్జాతీయం: భారత క్రికెటర్లను హగ్ చేయొద్దు – పాక్ అభిమానుల మెసేజ్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న ఆసక్తికర సమరం జరగనుంది. క్రికెట్ ప్రపంచం ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గత రెండు ఐసీసీ టోర్నీల్లో భారత్ పై అనుభవించిన ఓటమిని ప్రతీకారంగా మార్చాలని పాక్ అభిమానులు తీవ్రంగా కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అభిమానులు తమ జట్టు ఆటగాళ్లకు ఓ గట్టి సందేశం పంపారు. మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లను హగ్ చేసుకోవద్దని సూచించారు. ఈ మేరకు పాక్ జర్నలిస్ట్ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో పాక్ అభిమానులు, తమ ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లతో కౌగిలించుకోవడం తమకు నచ్చదని, ప్రత్యర్థి జట్టుపై పూర్తి దృష్టి పెట్టాలని కోరారు.
2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ భారత జట్టును ఓడించి టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే, అదే టోర్నీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్, అనంతరం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మెరుగైన ప్రదర్శన చేశామని అప్పటి కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గుర్తు చేసుకున్నారు.
సర్ఫరాజ్ మాట్లాడుతూ, “ఆ సమయంలో జట్టులో సీనియర్లైన షోయబ్ మాలిక్, హఫీజ్‌ల మద్దతు మాకు ఎంతో ఉపయోపడింది. వారు మమ్మల్ని ప్రేరేపించారు. మైండ్‌సెట్‌ను మార్చుకుని, ఆటలో కొన్ని మార్పులు తీసుకొచ్చిన తర్వాత విజయం సాధించగలిగాం” అని చెప్పాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌పై విజయం సాధించేందుకు పాక్ జట్టు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అయితే, భారత ఆటగాళ్లకు హగ్ ఇవ్వొద్దన్న అభిమానుల సూచన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.