అరకులోయ:దేశమంతటా కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రజలు ఒకపక్క కరోనా వైరస్ ఉందేమో అని లక్షణాలు ఉన్నా లేకున్నా పరీక్షల కోసం జనం క్యూ కడుతుంటే అవగాహన లేకనో లేక భయంతోనో కొందరు పరీక్షలకు కొందరు గిరిజనులు ముందుకు రావడంలేదు.
అరకులోయ కిముడుపల్లిలో ప్రజలకు పరీక్షలు చేయడానికి వెళ్లిన వైద్య సిబ్బందితో గ్రామస్తులు ఏకంగా వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేది లేక సిబ్బంది వెనుదిరిగారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిముడుపల్లిలో 550 మంది నివసిస్తున్నారు. వీరిలో సుమారు 40 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో జ్వరాల తీవ్రత అధికంగా ఉన్నట్టు తెలుసుకున్న పెదబయలు పీహెచ్‌సీ వైద్యాధికారి, సిబ్బంది మంగళవారం ఆ గ్రామానికి వెళ్లారు.
ఆ గ్రామంలో ఇప్పటికే ఏడుగురు కరోనాతో బాధపడుతున్నారు. ఇంకొంతమందికి కరోనా సోకినట్టు భావించిన వైద్యాధికారి రమ, ఇతర సిబ్బంది వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే కరోనా పరీక్షలు చేయించుకోవడానికి గ్రామస్తులు నిరాకరించారు. బలవంతంగా ఆరుగురికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
మిగతావారు పరీక్షలు చేయడానికి సహకరించలేదు. ‘మాకు కరోనా లేదు.. పరీక్షలు చేయవద్దు’ అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేది లేక వైద్య సిబ్బంది వెనుదిరిగారు. గ్రామానికి వెళ్లిన వారిలో హెల్త్ సూపర్‌వైజర్ సింహాచలం, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు ఉన్నారు.