అంతర్జాతీయం : చైనా ఏఐ స్టార్టప్ ‘డీప్‌సీక్’ డేటా భద్రతపై అనుమానాలు?
చైనాలోని హాంగ్జౌకు చెందిన ఏఐ స్టార్టప్ ‘డీప్‌సీక్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ సంస్థ విడుదల చేసిన ఆర్1 మోడల్ విశేషమైన పనితీరు కనబరుస్తోందని వినియోగదారులు తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇదివరకు మార్కెట్లో ఉన్న ఏఐ మోడల్స్ కంటే మెరుగైన అనుభూతిని అందించడంతో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందుతోంది.
డీప్‌సీక్ విడుదల చేసిన ఆర్1 మోడల్‌ను ఉచితంగా అందించడంతో లక్షలాది మంది వినియోగదారులు దీన్ని డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పటికే యాపిల్ యాప్ స్టోర్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఈ ఏఐ, గూగుల్ ప్లే స్టోర్‌లోనూ నంబర్ వన్‌గా నిలిచి తన ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే, ఇంతటి విస్తృత వినియోగం మధ్య డేటా భద్రతపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి.
డీప్‌సీక్ డేటా లీక్ ఆరోపణలు
ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘విజ్’ డీప్‌సీక్ సంస్థపై సంచలన విషయాలను బయటపెట్టింది. డీప్‌సీక్ వినియోగదారుల డేటాను సురక్షితంగా నిల్వ చేయడంలో విఫలమైందని, కొన్ని కీలకమైన సమాచారం ఓపెన్ ఇంటర్నెట్‌కు లీక్ అయిందని వెల్లడించింది.
“దాదాపు ఒక మిలియన్‌కు పైగా లైన్ల డేటాను డీప్‌సీక్ సురక్షితంగా స్టోర్ చేయకపోవడంతో ఆ సమాచారం బయటకు వచ్చింది. అందులో డిజిటల్ సాఫ్ట్‌వేర్ కీస్, యూజర్ల చాట్ లాగ్స్ సైతం ఉన్నాయి. ఆ సంస్థ నుంచి చాలా సున్నితమైన డేటా ఓపెన్ ఇంటర్నెట్‌కు చేరిన విషయాన్ని గుర్తించాం”- విజ్, ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ
విజ్ సంస్థ తన సైబర్ విశ్లేషణలో దాదాపు ఒక మిలియన్ లైన్ల డేటా అసురక్షితంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ లీకైన సమాచారంలో డిజిటల్ సాఫ్ట్‌వేర్ కీస్, యూజర్ల వ్యక్తిగత చాట్ లాగ్స్ వంటి కీలక వివరాలు ఉన్నట్లు బుధవారం విడుదల చేసిన బ్లాగ్ పోస్టులో వివరించింది.
డేటా భద్రతకు ఇంత పెద్ద లోపమా?
సైబర్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించే వర్గాల్లో డీప్‌సీక్‌పై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా, డేటా ప్రైవసీకి అధిక ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులు ఈ యాప్ సురక్షితమేనా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.
విజ్ సంస్థ తన విశ్లేషణ అనంతరం డీప్‌సీక్ సంస్థను అప్రమత్తం చేసింది. డీప్‌సీక్ తన డేటా లీక్‌ను గుర్తించి గంటలోపే భద్రతను కట్టుదిట్టం చేసినట్లు విజ్ కో-ఫౌండర్ అమీ లుత్వాక్ వెల్లడించారు. అయితే, అంత భారీగా లీకైన సమాచారాన్ని కనుగొనడం చాలా సులభమైనదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
డీప్‌సీక్ స్పందన లేదేంటి?
ఈ వివాదంపై డీప్‌సీక్ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సంస్థ డేటా భద్రతను మరింత కచ్చితంగా పర్యవేక్షించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
వాణిజ్య ఏఐ మోడల్స్‌లో డీప్‌సీక్ చేసిన విప్లవాత్మక మార్పులు హార్డువేర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ప్రభావం చూపుతున్నా, డేటా భద్రత విషయంలో ఇలాంటి విమర్శలు ఎదురుకావడం సంస్థ భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారింది.