fbpx
Tuesday, December 24, 2024
HomeNationalనీట్ పరీక్ష రాసే విద్యార్థులకు డ్రస్ కోడ్

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు డ్రస్ కోడ్

DRESS-CODE-FOR-NEET-BY-NTA

న్యూఢిల్లీ: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌ విధించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. సంప్రదాయ దుస్తులు అంటే బురఖా లాంటివి ధరించేవారు 2 లేదా 3 గంటలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

వారిని నిబంధనల ప్రకారం తనిఖీ చేసిన తరువాత పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. తేలికపాటి, హాఫ్‌ స్లీవ్స్‌ దుస్తులు మాత్రమే ధరించి రావాలి. పెద్ద పెద్ద బటన్లు, ఫుల్‌ స్లీవ్స్‌ కలిగిన దుస్తులకు అనుమతిలేదు. బూట్లకు బదులు చెప్పులు, శ్యాండిళ్లు మాత్రమే వేసుకోవాలి. ఇక అడ్మిట్‌కార్డుతో పాటు గుర్తింపు కార్డును కూడా ఖచ్చితంగా వెంట తీసుకురావాలి.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకూ పరీక్ష జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే విద్యార్థులను మరియు సిబ్బందిని లోపలకు అనుమతిస్తారు. పరీక్ష హాల్లో ప్రతి విద్యార్థీ ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్కులు, గ్లౌజులు ఖచ్చితంగా ధరించాలి. తరచూ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవాలి.

ఒకవేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశాల్ని కల్పిస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, బ్యాగులు సహా ఇతరత్రా వ్యక్తిగత వస్తువులను అనుమతించరు. పేపర్లను పంచేటప్పుడు లేదా లెక్కించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాలాజలాన్ని వాడరాదు.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కృష్ణా, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 151 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. 2019లో ఏపీ నుంచి 57,755 మంది దరఖాస్తు చేయగా, ఇప్పుడా సంఖ్య 61,892కు పెరిగింది.
ఈ ఏడాది అత్యధికంగా మహారాష్ట్రలో 2,28,914 మంది పరీక్ష రాస్తుండగా, అత్యల్పంగా మిజోరాంలో 1,741 మంది రాస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular