‘దృశ్యం’ సిరీస్‌కు వెంకటేష్ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఆయన పోషించిన ‘రాంబాబు’ పాత్ర రెండో భాగానికి మరింత హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు మలయాళంలో మోహన్ లాల్‌తో ‘దృశ్యం 3’ ప్రారంభమైంది. అయితే ఈసారి డైరెక్ట్ డబ్బింగ్‌తోనే అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తుండటం టాలీవుడ్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
తెలుగులో వెంకటేష్ లేకుండా ‘దృశ్యం 3’ అనేది అసాధ్యమనే అభిప్రాయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. డబ్బింగ్ సినిమాతో అనుబంధం తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా, తెలుగులో రీమేక్ చేస్తే 40 కోట్లకు పైగా బిజినెస్ ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.
వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఆదరణ ఉంది. ఆయన నటన, భావోద్వేగాలతో కూడిన ప్రెజెన్స్ లేకపోతే ‘దృశ్యం’ సిరీస్‌కు ఆత్మే మిగలదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. గత రెండు భాగాల విజయానికి ఆయన పాత్ర కీలకమైంది.
మలయాళ వెర్షన్‌ను అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడమే మేకర్స్ తుదినిర్ణయమైతే, ఇది తెలుగు మార్కెట్‌లో భారీ నష్టాలకు దారితీయవచ్చని టాక్. ఇక నిర్ణయం మేకర్స్ చేతిలోనే ఉంది.