న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మాస్ వ్యాక్సినేషన్ దిశగా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడానికి యంత్రాంగం యొక్క సర్వ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ నెల 28, 29వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో కేంద్రం మాక్‌డ్రిల్ చేపట్టబోతోంది.
అయితే టీకా లేకుండానే చేపట్టే ఈ ‘డ్రై రన్’ అచ్చంగా వ్యాక్సినేషన్ చేసే విధంగానే ఉంటుంది. ఒక్కో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని జిల్లా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రైవేట్ ఆస్పత్రులు వంటి ఐదు విభాగాల్లో వ్యాక్సినేషన్ సన్నద్ధతను అంచనా వేయడానికి ప్రణాళిక రచిస్తోంది.
‘వ్యాక్సిన్ సరఫరా, కేటాయింపులు, పరీక్షలు, సిబ్బంది మోహరింపు, ‘డ్రై రన్’ చేపట్టే చోట ఏర్పాట్లు, మాక్ డ్రిల్ సమయంలో భౌతిక దూరం వంటి ముందు జాగ్రత్తలను పాటించడం, నివేదికల తయారీ, సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం వివరాలను ‘కో విన్’ సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అధికారులకు ఉన్న అనుభవాలను కూడా వివిధ స్థాయిల్లో సమీక్షిస్తామని వివరించింది. వ్యాక్సినేషన్ సందర్భంగా ఏమైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై వివిధ రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది జిల్లా స్థాయి ట్రైనర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ముగిసిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారావి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్నటి వరకు ప్రపంచంలోని కోవిడ్ హాట్‌స్పాట్లలో ఒకటిగా ఉన్న ధారావిలో గత 24 గంటల్లో ఒక్క కొత్త కరొనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఏప్రిల్ ఒకటి తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ మొత్తం 3,788 కేసులు నమోదు కాగా, 3,464 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ యాక్టివ్ కేసులు 12 మాత్రమే ఉన్నాయి.