సిద్దిపేట, తెలంగాణ: తెలంగాణలో రాజకీయ పరంగా తీవ్ర వేడిని పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నిక మంగళవారం జరగనుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్ సరళి ఎలా ఉంటుంది, ఎంతశాతం ఓటింగ్ జరుగుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
కరోనా భయం పూర్తిగా వీడనందున ఎంతమంది ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. 23 మంది బరిలో ఉన్నా, ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధానంగా పోటీ నిలిచింది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థులు అభ్యర్థించారు.
2018లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,90,483 మంది ఓటర్లు ఉండగా 1,63,658 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.92% ఓటింగ్ నమోదైంది. ఈసారి 1,98,807 మంది ఓటర్లు ఉండగా ఏ మేరకు పోలింగ్ నమోదవుతుందో అనేది ప్రశ్నార్థకం.
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏ కులం వారివి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే అంచనాలు వేశారు. అత్యధికంగా ముదిరాజులు 41,214 మంది, గొల్ల కురుమలు 16,190, గీత కార్మికులు 22,512, మాదిగ 23 వేల మంది, 11 వేల మంది మాల, 13 వేల మంది చేనేత కార్మికులు, 7 వేల మంది రజకులు, 6వేల మంది మున్నూరు కాపులు, 10,012 మంది రెడ్లు ఉన్నారు.
ముస్లిం, దూదేకుల, బ్రాహ్మణ, వెలమ, బుడిగ జంగాలు, క్రిస్టియన్ మైనార్టీలు, లంబాడీలు కూడా ఉన్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేశారు. కుల సంఘాలకు భవనాలు, ఇతర హామీలిచ్చారు.