న్యూఢిల్లీ: ఐపీఎల్ మొదలైనప్పటి నుండి ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఎన్నో మైలురాయిలను అందుకుండి, మూడు సార్లు కప్పు కూడా గెలిచింది. దాదాపు ప్రతి సారి టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది. వీటన్నింటి వెనక ఉన్నది గొప్ప సారథి మహేంద్ర సింగ్ ధోని.
అయితే ఈ సారి ఐపీఎల్ లో ఘోరంగా విఫలమైన జట్లలో సీఎస్కే ఒకటి. కీలక ఆటగాళ్ళు లేకపోవడం, కరోనా కేసులతో ఆటగాళ్ళు మానసికింగా కుంగిపోవడం, ధోనీ వైఫల్యం టీం ని బాగ్ దెబ్బ తీసాయి. అయితే తదుపరి ఐపీఎల్ పగ్గాలను సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ చేపట్టే అవకాశాలు ఉన్నాయని టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. కేవలం ఆటగాడిగా కొనసాగేందుకే మొగ్గుచూపే క్రమంలో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని, ఆ బాధ్యతలను డుప్లెసిస్‌కు అప్పగిస్తాడని భావిస్తున్నట్లు అన్నారు.
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే కొత్త కెప్టెన్ చూడబోతున్నామని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్- 2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై అపఖ్యాతి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్ ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే మంచిదని, జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అయితే సీఎస్‌కే జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా ధోనియే, చెన్నై టీంకు సారథ్యం వహిస్తారని స్పష్టం చేశారు.
‘‘ నాకు తెలిసినంత వరకు 2011 తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న సమయంలో కెప్టెన్ క్యాండిడేట్ సిద్ధంగా లేనందు వల్లే ధోని సారథ్య బాధ్యతలు మోయక తప్పలేదు. ఆ తర్వాత సరైన సమయం చూసి విరాట్ కోహ్లికి జట్టు పగ్గాలు అందించాడు. ఆ తర్వాత ధోని ఆటగాడిగా కొనసాగాడు. ఇప్పుడు కూడా ధోని అదే తరహాలో ఆలోచిస్తాడనుకుంటున్నా. వచ్చే ఏడాది తను సీఎస్‌కే కెప్టెన్‌గా ఉండకపోవచ్చు. డుప్లెసిస్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పి తను ఆటగాడిగా కొనసాగుతాడేమో అని అన్నాడు.