అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాల్లో ఈ–లోక్ అదాలత్ ను నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్, లీగల్ సరీ్వసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ రాకేశ్ కుమార్ ఆదేశాల మేరకు నిన్న రాష్ట్రంలో ఈ–లోక్ అదాలత్ చేపట్టారు.
అమరావతిలోని హైకోర్టులో మూడు బెంచ్‌లు, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అన్ని కోర్టుల్లో 322 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ఈ–లోక్ అదాలత్‌లో మొత్తం 6,351 కేసులను పరిష్కరించారు.
సెటిల్‌మెంట్ కింద రూ.33.77 కోట్ల చెల్లింపులు కూడా చేశారు. ఈ–లోక్ అదాలత్‌కు సహకరించిన వారందరికీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా అమరావతి హైకోర్టులో నిర్వహించిన ఈ–లోక్ అదాలత్ కేసులను న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి మరియు జస్టిస్ నైనాల జయసూర్య బెంచ్‌లు విచారించాయి. ఈ మూడు బెంచ్‌లు 368 కేసులను విచారించగా, అందులో 262 కేసులకు పరిష్కరాన్ని ఇచ్చాయి. రూ.1.01 కోట్లను సెటిల్‌మెంట్ కింద నిర్ణయించాయి. హైకోర్టులో లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన వారికి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు తెలిపారు.