విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఇవాళ ఒక పెద్ద కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రతి ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అడ్మిషన్లకు ప్రాంఆనికంగా తీసుకునే ఇంటర్ మార్కుల వెయిటేజ్ ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తిసుకుంది.
ఇప్పటి వరకు ప్రతీ సంవత్సరం ఇంటర్ లో విద్యార్థులు సాధించే మార్కులను ఆధారంగా చేసుకుని ఎంసెట్ ప్రవేశ పరీక్షలో 25% వెయిటేజ్ ఇస్తూ వస్తోంది ఏపీ ఉన్నత విద్యామండలి. అయితే ఈ సంవత్సరం రాష్ట్రంలో కోవిడ్ రెండవ వేవ్ ఉదృతి వల్ల ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలతో పాటు మొదటి సంవత్సర పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్ అయినట్లు ప్రకటించిన సంగతి విదితమే.
కాగా ఈ నేపథ్యంలోనే ఈ సారి జరిగే ఈఏపీసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ని తొలగిస్తూ ఇవాళ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులను జారీ చేసింది. కాబట్టి ఈ సారి వంద శాతం ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అగ్రికల్చర్, ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తమ నిర్ణయాన్ని ప్రకటించింది.