అంతర్జాతీయం: హిమాలయాలను వణికించిన భూకంపం: 126కు చేరిన మృతులు
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించి హిమాలయ ప్రాంతాలను వణికించింది. మంగళవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 126కు చేరుకుంది.
చైనా అధికారిక సమాచారం ప్రకారం, ఈ ఘటనలో 188 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవారితో మరింత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
భూకంపం నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో ఉదయం 6:35 గంటలకు సంభవించింది.
ఈ భూకంప కేంద్రం టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. క్షణాల్లో జరిగిన ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంప ప్రభావంతో టిబెట్ రీజియన్‌లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.
శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, మరో రెండు స్వల్ప ప్రకంపనలు 4.7, 4.9 తీవ్రతలతో చోటుచేసుకున్నాయి.
దలైలామా సంతాపం
టిబెట్‌లోని డింగ్రీ కౌంటీలో జరిగిన ఈ విపత్తుపై బౌద్ధ మత గురువు దలైలామా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, అనేకమంది గాయపడటంపై ఆయన బాధ చెందారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.
భారత్‌లో ప్రకంపనలు
ఈ భూకంప ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. దిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. భూటాన్, చైనా, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.