న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరికి బ్యాంకుల వద్ద లోన్లు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులను జారీ చేసింది. ఈ నెల ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరుకావాలని సుజనాకు ఈడీ నోటీసులు అందించింది. డొల్ల కంపెనీలతో సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు అభియోగాలు నమోదైన విషయంలో ఈ నోటీసులు అందాయి.
సుజనా చౌదరి పలు బ్యాంకుల నుండి దాదాపు రూ.5,700 కోట్ల మేర రుణాళు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేశారనే అభియోగాలపై ఈడీ కేసులు నమోదు చేసింది. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే సుజనా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.
ఈ పాటికే ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది సీబీఐ. వీటి ఆధారంగా 2018లో సుజనాపై ఈడీ సోదాలు కూడా నిర్వహించింది. 126 షెల్ కంపెనీలు సృష్టించి సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆధారాలను సేకరించింది. వాటిలో సెంట్రల్ బ్యాంకును రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.159 కోట్లు సుజనా మోసం చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించింది.