విశాఖపట్నం: మాజీ వైసీపీ ఎంపీ మరియు ప్రముఖ సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణకు శనివారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) భారీ షాక్ ఇచ్చింది. భూకబ్జా కేసులో భాగంగా, విశాఖపట్నంలోని ఆయన ఆస్తులపై ఐదు చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ గణ్మణి వెంకటేశ్వరరావు, మరో నిందితుడు గద్దె బ్రహ్మాజీ నివాసాలు, కార్యాలయాల్లో జరిపినట్లు ఈడీ అధికార వర్గాలు ధృవీకరించాయి.
భూకబ్జా కేసు ఆధారంగా సోదాలు
విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ సోదాలు చేపట్టింది. హయగ్రీవ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ జగదీశ్వరుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసారు. జగదీశ్వరుడు తన ఫిర్యాదులో, ప్రభుత్వం కేటాయించిన 12.5 ఎకరాల భూమిని నకిలీ పత్రాల ద్వారా ఎంవీవీ సత్యనారాయణ దక్కించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
నకిలీ పత్రాలు – భూకబ్జా ఆరోపణలు
ఈ భూమి వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం కేటాయించబడింది. 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని మంజూరు చేసినట్లు, 2010లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దానిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు జగదీశ్వరుడు వెల్లడించారు. అయితే, 2020లో MOU సంతకం సమయంలో, నిందితులు నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలు ద్వారా విక్రయ పత్రాలు రూపొందించారని, ఖాళీ కాగితాలపై బలవంతంగా సంతకాలు పెట్టించారని ఆయన ఆరోపించారు.
కోర్టు నుంచి ముందస్తు బెయిల్
తాజాగా నమోదైన ఈ కేసులో ఎంవీవీ సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ వారు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎంవీవీ సత్యనారాయణ సినీ ప్రస్థానం
ఎంవీవీ సత్యనారాయణ తెలుగు సినిమా పరిశ్రమలో సుపరిచితమైన వ్యక్తి. ఆయన గీతాంజలి (2014), అభినేత్రి (2016), లక్ ఉన్నోడు (2017), నీవెవరో (2018) వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాజకీయాల్లో సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో విశాఖపట్నం ఎంపీగా గెలుపొందారు. అయితే, 2024 ఎన్నికలలో వైసీపీ టిక్కెట్‌పై పోటీ చేసి పరాజయం పొందిన విషయం పాఠకులకు తెలిసిందే.