హైదరాబాద్: సెప్టెంబరు 1వ తేదీ నుండి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవనున్నాయి. ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్నాళ్ళు మూసివేయబడ్డ విద్యాసంస్థల ప్రారంభంపై సీఎం సమీక్షను జరిపారు.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ సమీక్షకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరితో చర్చలు జరిపిన తరువాత వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు అంగన్‌వాడీల నుండి పీజీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరవనున్నారు.
ఈ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించాలి. ఈనెల 30లోపు తరగతి గదులు, హాస్టళ్లు, అన్ని విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. విద్యాసంస్థల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి’’ అని స్పష్టం చేశారు.